SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 2:21 pm Posted by : SALAM PRODDATUR

ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి – డీఎస్పీ బాలస్వామి రెడ్డి

 

 

–రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి

 

–హెల్మెట్, సీట్‌బెల్ట్ నిబంధనల అమలులో నిర్లక్ష్యం వద్దు

 

–ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

 

సలాం  ప్రొద్దుటూరు:

 

వార్షిక పోలీస్ స్టేషన్ తనిఖీల్లో భాగంగా శనివారం ప్రొద్దుటూరు డీఎస్పీ ఈ. బాలస్వామి రెడ్డి ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలు, కేసుల దర్యాప్తు పురోగతి, సిబ్బంది విధుల నిర్వహణ తీరును పరిశీలించారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు చేపడుతున్న చర్యలు, రోడ్డు ప్రమాదాల నివారణకు అమలు చేస్తున్న విధానాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

 

ట్రాఫిక్ నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరించాలి

 

అనంతరం ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో సమావేశమైన డీఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై నిరంతరం అవగాహన కల్పించాలని ఆదేశించారు.ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

 

ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలే లక్ష్యం

ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో విధులు నిర్వహించాలని, రద్దీ ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సిబ్బందికి సూచించారు. విధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన పనితీరుతో ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని డీఎస్పీ బాలస్వామి రెడ్డి ఆదేశించారు.ఈ తనిఖీలో ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎన్. భాస్కర్, ఎస్‌ఐ ఎం. భాస్కర్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.